పులుసుకి కావాల్సినవి:
ఓపిక, ఓర్పు, సహనం, ప్రేమ ~ ఇవి లేక పోతే సంక నాకిపోతుంది, చూసుకోండి ఇంక…
వంకాయలు (1 పెద్దది అయితే, 3/4 చిన్నవి అయితే)
ఉల్లిపాయ (1)
చింతపండు (లెమన్ సైజు)
పచ్చి మిరపకాయలు (6)
నూనె (2 స్పూన్స్ – తిరగమాత కి)
కరివేపాకు (1 రెబ్బ)
తిరగమాతకి: కొంచెం ఆవాలు (1 స్పూన్), జీలకర్ర (1/2 స్పూన్), మెంతులు (1/4 స్పూన్), మినపప్పు (1 స్పూన్), పచ్చిశనగపప్పు (1 స్పూన్), ఎండు మిరపకాయలు (2), పసుపు (1/4 స్పూన్), ఇంగువ (1/4 స్పూన్))
పులుసు చేయడానికి కొంచెం ప్రెప్ వర్క్:
బాండీ లో 2 స్పూన్స్ నూనె లో కొన్ని ఎండుమిరపకాయలను వేయించి, చల్లార్చి, పొడి చేసి పక్కన పెట్టుకోండి (లేదా మామూలు కారం కూడా వేసుకు చావచ్చు)
వంకాయకి కాస్త నూనె రాసి స్టవ్ మీద పెట్టి బాగా ఉడికే వరకు కాల్చండి
కాల్చిన వంకాయకి పొట్టు తీసేసి లోపల గుజ్జుని రోటిలో కొంచెం మెత్తగా నూరి పక్కన పెట్టుకోండి
ఉల్లిపాయని చిన్న ముక్కలు తరుగుకొని పక్కన పెట్టుకోండి
పచ్చి మిరపకాయలను సగం స్లిట్స్ లాగ తరుగుకొని పక్కన పెట్టుకోండి
ఒక 2 కప్స్ వాటర్ లో చింతపండుని నానపెట్టి, వడకట్టి పక్కన పెట్టుకోండి
తిరగమాత: బాండీ లో 2 స్పూన్స్ నూనె వేసి, వేడెక్కాక ఆవాలు, మెంతులు, జీలకర్ర, మినపప్పు, ఇంగువ వెయ్యండి, కాస్త వేగాక, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి కొంచెం వేయించుకొని చివరగా కొంచెం పసుపు, కరివేపాకు వేసి పక్కన తగలెట్టండి
పులుసు కలిపే విధానం:
గిన్నెలో చింతపండు రసం ఉంచుకొని, దానిలో కొంచెం రుచికి తగ్గ ఉప్పు, ఎండుమిరపకాయల కారం 1 స్పూన్ వేసి బాగా కలపండి – తీపి కావాలంటే కొంచెం చిన్న బెల్లం ముక్క వేసుకోండి (కానీ ఎందుకు చెప్పండి తరువాత Diabetic అయ్యాము అనుకోడానికి కాకపోతే)
ఆ గిన్నెలో ఇప్పుడు తిరగమాత లో వేయించుకున్నవన్ని వేసి కలపండి
ఇప్పుడు నూరిన వంకాయ ని అదులో వేసి కలిపెయ్యండి
వీలుంటే మినపప్పు వడియాలు వేయించుకొని కలుపుకోండి అద్భుతంగా ఉంటుంది
ఎప్పుడు, ఎలా మింగచ్చు:
నోటితో మింగండి, ఇంకేంటి అన్నిటికి
సరే, ఆశ పడ్డారుగా చదవడానికి – అన్నం లో మామూలే, ఉప్పుడు పిండి లోకి చాలా బావుంటుంది, కంది పచ్చడి ఉంటె అది అన్నం లో కలుపుకొని ఈ పచ్చిపులుసు వేసుకుంటే తాతలు తిరిగి వస్తారు…